వైసీపీకి ఇలాంటోళ్లు చాలు..!

0

ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టి ఇంకా మూడు నెలల గడవకముందే వైసీపీ నేతలు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. కొందరు నేటికి పని చెప్పి వార్తల్లోకెక్కుతుంటే, మరికొందరు తమ చర్యలతో పార్టీని కూడా చిక్కుల్లో నెడుతున్నారు. ఇప్పటికే అనేక మంది అధికార పార్టీ నేతల దూకుడు వైసీపీని ఇరకాటంలో నెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చీరాలలో వైసీపీ నేతలు సహా పలువురి తీరు ఆ పార్టీ పరువు తీస్తోంది.

తాజాగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హోదా నుంచి ఎస్వీబీసీ చానెల్ చైర్మన్ హోదాని దక్కించుకున్న ప్రుథ్వీరాజ్ కూడా తోడయ్యారు. సినీ నటుడిగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అందరినీ అలరించిన ఆయన ఎన్నికలకు ముందు రాజకీయ ఆరంగేట్రం చేశారు. జగన్ కి అండగా నిలిచినందుకు ప్రతిఫలంగా అతి కీలకమైన పోస్ట్ ఆయనకు దక్కింది. అయితే ఆయన హోదాకు తగ్గట్టుగా హూందాగా వ్యవహరించాల్సిన వేళ నోటిదురుసుతో సాగడం చాలామందిని విస్మయానికి గురిచేస్తోంది.

విపక్షంలో ఉన్న సమయంలో కొంత దూకుడుగా వెళ్లినా జనం హర్షిస్తారు. పాలకపక్షాన్ని ఘాటుగా విమర్శించడాన్ని ఆస్వాదిస్తారు. అదే సమయంలో పాలకపక్షంలో ఉన్న నేతలు సంయమనం పాటించాల్సి ఉంటుంది. అత్యంత సహనం పాటించాల్సి ఉంటుంది. దానికి విరుద్ధంగా నోటిదురుసుతో విపక్షాలను ఎదుర్కొందామనుకుంటే చివరకు ఏమవుతుందో చంద్రబాబు అనుభవం చాటుతోంది. అయినా వైసీపీ నేతలు పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు.

ప్రథ్వీరాజ్ వంటి వారు తమ తీరు మార్చుకుని హోదాకి అనుగుణంగా వ్యవహరించకపోతే చివరకు నష్టపోయేది పాలకపార్టీనే అన్నది కాదనలేని సత్యం. కమెడియన్ ముద్ర చెరిపేసుకుని రాజకీయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరాన్ని ఈయన తీరు చాటుతోంది. విపక్షాల ప్రశ్నలకు తగురీతిలో సమాధానాలు చెప్పి సామాన్య జనాలకు ఆకట్టుకునే పనిచేయాల్సిన సమయంలో నోటికి పనిచెప్పే ప్రయత్నం చేస్తే నిండామునగడం ఖాయం. ఇలాంటి ఒకరిద్దరి నేతలతో వైసీపీ పుట్టి మునగడం ఖాయం అని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here