Exclusive: జ‌గ‌న్ రాజ‌ధానికి బ్రేకులు వేసిందెవ‌రు?

  0

  ఏపీ రాజ‌ధాని అంశంలో ఎంతో దూకుడుగా క‌నిపించిన వైఎస్సార్సీపీ అధినేతకు బ్రేకులు ప‌డ్డాయి. వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాలు దానికి నిద‌ర్శ‌నంగా ఉన్నాయి. ఏపీ క్యాబినెట్ భేటీలో తుది నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పి వెన‌క్కి త‌గ్గ‌డం తార్కాణం కాగా, ఆ వెంట‌నే విశాఖ‌లో సీఎం నోరు మెద‌ప‌క‌పోవ‌డం మ‌రింత బ‌ల‌ప‌రుస్తోంది. రాజ‌ధాని మార్పుల‌ను ఎవ‌రో అడ్డుకుంటున్నార‌నో సందేహాలు పెరుగుతున్నాయి. ఏపీ ప్ర‌భుత్వానికి ఈ వ్య‌వ‌హారం గుదిబండ కాబోతోందా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వైసీపీలో విబేధాలా లేక కేంద్రం నుంచి కొర్రీలా అన్న‌దే ప్ర‌స్తుతానికి స్ప‌ష్ట‌త రావ‌డం లేదు.

  ద‌క్షిణాఫ్రికా త‌ర‌హాలో మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను తొలుత సీఎం ముందుకు తీసుకొచ్చారు. ఆయ‌న‌కు ముందు అసెంబ్లీలో గుడివాడ అమ‌ర్ నాథ్ వంటి వారు మాట్లాడినా , జ‌గ‌న్ నోటి నుంచి రావ‌డంతోనే ర‌చ్చ మొద‌ల‌య్యింది. జీఎన్ రావు క‌మిటీ రిపోర్ట్ వ‌చ్చింది. బీసీజీ గ్రూప్ మ‌ధ్యంత‌ర నివేదిక కూడా ఇచ్చింది. వాటిని చ‌ర్చించి ఛ‌లో విశాఖ అంటార‌ని అంతా ఆశిస్తే అనూహ్యంగా క్యాబినెట్ భేటీలో మ‌రో క‌మిటీకి రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. హైప‌వ‌ర్ క‌మిటీ అని చెప్పినా అందులో ఎవ‌రెవ‌రు ఉంటార‌న్న‌ది ఇప్ప‌టికీ చెప్ప‌లేదు. మూడు వారాల్లో నివేదిక అంటూ వెల్ల‌డించినా క‌మిటీ వివ‌రాలు వెల్ల‌డించ‌క‌పోవ‌డం అనుమానాలు బ‌ల‌ప‌రుస్తోంది.

  క్యాబినెట్ స‌మావేశం జ‌రిగిన రోజే సీఎం క్యాంప్ ఆఫీసుల మాజీ కేంద్ర‌మంత్రి సురేష్ ప్ర‌భు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. జ‌గ‌న్ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఇద్ద‌రి మ‌ధ్య కీల‌క చ‌ర్చ‌లు సాగిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ అవి ఏమిట‌న్న‌దే కీల‌కంగా మారింది. కేంద్ర ప్ర‌భుత్వం త‌రుపున దూత‌గా సురేష్ ప్ర‌భు వ‌చ్చిన‌ట్టు అంతా భావిస్తున్నారు. రాజ‌ధాని ర‌గ‌డ‌కు తాత్కాలికంగా ముగింపు ప‌ల‌కాల‌ని కేంద్రం పెద్ద‌లు జ‌గ‌న్ కి సూచిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికిప్పుడే ఈ విష‌యంలో ముందుకెళ్ల‌డం స‌రికాద‌ని చెబుతూ సున్నితంగా జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం జ‌రిగిన‌ట్టుగా అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు బీజేపీ నేత‌లు, ఉప రాష్ట్ర‌ప‌త్రి వెంక‌య్య కూడా ఈ అంశం కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం. వారి తో పాటుగా రాజ‌ధాని రైతులు కూడా నేరుగా ప్ర‌ధానికి లేఖ‌లు రాశారు. మోడీ శంకుస్థాప‌న చేసిన అమ‌రావ‌తిని అర్థాంత‌రంగా ముగించ‌డంపై అభ్యంత‌రాలు తెలిపారు.

  ఈ ప‌రిణామాల‌కు తోడుగా ఏపీలో వైసీపీ మిన‌హా దాదాపుగా అన్ని పార్టీలు అమ‌రావ‌తికి మ‌ద్ధ‌తుగా ఉన్నాయి. కొంద‌రు నిర‌స‌న‌లు చేస్తుంటే మిగిలిన నేత‌లు మాత్రం ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ పార్టీ ఏపీలో దాదాపుగా ఒంట‌రి అయ్యింది. ఇంగ్లీష్ మీడియం విష‌యంలో ల‌భించిన మ‌ద్ధ‌తు కూడా ఇక్క‌డ జ‌గ‌న్ కి ద‌క్క‌లేదు. ఈ ప్ర‌భావం కూడా ప‌నిచేసిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో జ‌గ‌న్ నోటి నుంచి విశాఖ‌కి వ‌రాల జ‌ల్లు కురిపిస్తార‌ని ఆశించిన వారికి విశాఖ ఉత్స‌వ్ వేదిక నిరాశ‌ను మిగిల్చింది. ప్ర‌స్తుతానికి ఆయ‌న రాజ‌ధాని విష‌యంలో మౌనంగా ఉండ‌డం మిన‌హా మ‌రో దారి క‌నిపించ‌డం లేద‌ని కొంద‌రు చెబుతున్నారు.

  అదే స‌మ‌యంలో స్వ‌యంగా జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. వ‌చ్చే వారంలో అవి ఫ‌లిస్తే అక్క‌డే తేల్చుకునే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా క‌ర్నూలుకి హైకోర్ట్ ని త‌ర‌లించాలంటే రాష్ట్ర‌ప‌తి గెజిట్ లో మార్పులు అవ‌స‌రం అవుతాయి.అ దే స‌మ‌యంలో అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధానిగా గుర్తించిన త‌రుణంలో కేంద్రం దానికి అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వ్య‌వ‌హారాలు కేంద్రం చేతుల్లో ఉన్నందున అటు నుంచి కొర్రీలు ప‌డితే జ‌గ‌న్ అడుగులు త‌డ‌బ‌డ‌డం ఖాయం. ఈ నేప‌థ్యంలో వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. జ‌గ‌న్ కి క్యాపిటల్ అంశం కొలిక్కి వ‌స్తుందా..కొత్త స‌మ‌స్య తెస్తుందా అన్న‌దే ఇప్పుడు కీల‌కాంశం అవుతోంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here